తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్, NewzFast Telugu (మిర్యాలగూడ, నల్లగొండ జిల్లా): మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని గుమస్తా కాలనీ వద్ద రూ.33 కోట్లతో నిర్మించిన 560 డబుల్ బెడ్‌రూం ఇళ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
సభలో మంత్రి మాట్లాడుతూ, తమ ఐదేళ్ల పాలన నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో బంగారు కాలంగా నిలిచిపోతుందన్నారు. గత ప్రభుత్వం పూర్తి చేయని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు.
జిల్లాలోని బస్వాపూర్, ధర్మారెడ్డికాల్వ, పిలాయిపల్లి, మిర్యాలగూడ నియోజకవర్గంలోని తోపుచర్ల, కేశవాపూర్, కొండ్రపోలు, దున్నపోతులగండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని మంత్రి తెలిపారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే గ్రావిటీ ద్వారా నల్లగొండ, నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందుతుందన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించాలని కోరారు.

