థానే వ్యభిచారం శివసేన మహిళలు, NewzFast Telugu (మహారాష్ట్ర, థానే): చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చూసీచూడనట్లు వ్యవహరిస్తే, సామాన్యులతో పాటు మహిళలు కూడా రంగంలోకి దిగుతారనడానికి మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
మహారాష్ట్రలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో థానే ఒకటి. నిత్యం ప్రజలు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో కొద్దికాలంగా బహిరంగంగా వ్యభిచారం జరుగుతోందని శివసేన మహిళా నేతలు ఆరోపించారు.
దీంతో ఆ మార్గంలో వెళ్లే కుటుంబాలు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు.
ఈ అసాంఘిక కార్యకలాపాలపై స్థానిక మహిళలు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. పోలీసులు తమ విధులను విస్మరించారని ఆరోపిస్తూ, శివసేన మహిళా అఘాడీ కార్యకర్తలు నేరుగా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
నడిరోడ్డుపైకి చేరుకున్న మహిళా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తూ, అక్కడ వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారిని నడిరోడ్డుపై పరుగెత్తిస్తూ దేహశుద్ధి చేసి అక్కడి నుంచి తరిమికొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియోలు చూసిన నెటిజన్లు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన పద్ధతి కాకపోయినా, పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే మహిళలు ఈ సాహసానికి పాల్పడాల్సి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం థానేలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికైనా పోలీసులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.




