తమ్మిడి కుంట చెరువు, NewzFast Telugu (హైదరాబాద్): తమ్మిడి కుంట చెరువును అద్భుతంగా డిజైన్ చేశారని టాలీవుడ్ నటుడు నాగార్జున అన్నారు. చెరువు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
మొదట భూమి కోసం రంగనాథ్ తన వద్దకు మాట్లాడేందుకు వచ్చినప్పుడు మనసులో ఏదో పెట్టుకుని వెళ్లానని, కానీ ఆయన చాలా ఓపికగా తనతో మాట్లాడారని నాగార్జున చెప్పారు. ఆయన మాటలు విన్న తర్వాత తన మనసు మారిందని అన్నారు.
ఎవరూ డెబిట్ కార్డ్ తీసుకుని పైకి వెళ్లమని, మన సిటీ కోసం ఇది చేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మన సిటీ ఎందుకు అలా ఉండదని అనుకునేవాడినని, ఇప్పుడు ఈ చెరువును చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
తమ్మిడి కుంట చెరువు వద్ద తాను సినిమా షూటింగ్ చేస్తానని కూడా తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి చెరువులు, నదులు అంటే చాలా ఇష్టమని నాగార్జున అన్నారు. ఎంతో సంకల్పంతో ఆయన ఈ పని చేస్తున్నారని చెప్పారు.
మంచి పని చేసేటప్పుడు నెగిటివిటీని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చెరువును బాగు చేయడం ద్వారా వర్షాకాలంలో ట్రాఫిక్ సమస్యను కూడా నివారించవచ్చని నాగార్జున అన్నారు. నీళ్లు చెరువులోకి వెళ్తే ట్రాఫిక్ జామ్ సమస్య ఉండదని చెప్పారు.
చెరువుల్లో నీళ్లు ఉంటే ఎల్నినో వంటి పరిస్థితులను కూడా ఎదుర్కోవచ్చని తెలిపారు.
మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తున్నారని, దాని ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినా తాను వెళ్తానని నాగార్జున చెప్పారు.




