తెలంగాణ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పెంపు, NewzFast Telugu (తెలంగాణ): ప్రభుత్వ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సంఖ్యను పెంచాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్ (TDA) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం మసాబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్, కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నందున కేవలం 429 పోస్టుల భర్తీతో సరిపెట్టకుండా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని అసోసియేషన్ కోరింది. ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన జీవో నంబర్ 31లోని నియామక నిబంధనలను యూజీసీ 2018 మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చాలని విజ్ఞప్తి చేసింది.
విశ్వవిద్యాలయాల నియామక దరఖాస్తుల కోసం సెంట్రల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించే చర్యలు తీసుకోవాలని టీడీఏ సూచించింది. అభ్యర్థుల ఒకటి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే విధానం తేవాలని కూడా కోరింది.
స్థానికతను రాష్ట్రంలోని 33 జిల్లాల పాఠశాలల వివరాల ఆధారంగా పరిశీలించాలని, ఇంటర్వ్యూలకు అభ్యర్థులను 1:25 నిష్పత్తిలో పిలవాలని అసోసియేషన్ ప్రతిపాదించింది. అధ్యాపక నియామకాల్లో దరఖాస్తులు, ఏపీఐ స్కోర్ల పరిశీలన పారదర్శకంగా జరగాలని కూడా పేర్కొంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల పెంపు, మంజూరైన పోస్టుల భర్తీ, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా జీవో 31 సవరణపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అసోసియేషన్ కోరింది.


