తెలంగాణ ఎస్ఐఆర్ ఓటరు జాబితా దరఖాస్తు గడువు, NewzFast Telugu: తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసాయిదా జాబితా విడుదల కాగా, గైర్హాజరు, చిరునామాలో లేకపోవడం, చనిపోయిన, డూప్లికేట్ (ఏఎస్డీడీ) కారణాలతో సుమారు 73 లక్షలకు పైగా ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది.
ఈ జాబితాలో అర్హత ఉన్నవారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అర్హులైన ఓటర్లు అవసరమైన పత్రాలు సమర్పించి, తుది జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవచ్చని తెలిపింది.
ఇందుకోసం ఓటర్లు సంబంధిత బీఎల్ఓలను వెంటనే సంప్రదించాలని, లేదా 1950 నంబరుకు కాల్ చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ నవంబర్ 21 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత రాష్ట్రంలో తుది ఓటరు జాబితా వెలువడుతుందని పేర్కొంది.
ఎన్యూమరేషన్ పత్రాలను సరిగా నింపకపోవడం, నిర్ణీత గడువులోగా సమర్పించకపోవడం, బీఎల్ఓల నిర్లక్ష్యం వంటి కారణాలతో పలువురి పేర్లు ముసాయిదా జాబితాలో చోటు కోల్పోయాయి. ఇలాంటి ఓటర్లు ఇంతకుముందు పత్రాలు ఎందుకు సమర్పించలేకపోయారో వివరించాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోనే నివాసం మార్చుకున్నవారు కొత్త చిరునామా, అసెంబ్లీ నియోజకవర్గం పేర్కొంటూ చిరునామా రుజువుతో కూడిన ప్రకటనతో పాటు ఎన్యూమరేషన్ పత్రాన్ని సమర్పించాలి. చిరునామా పత్రాలు లేని నిరాశ్రయ ఓటర్ల విషయంలో బీఎల్ఓ క్షేత్రస్థాయి ధ్రువీకరణ నివేదికను నివాస రుజువుగా అంగీకరిస్తారు.
ఆమోదించిన దరఖాస్తులను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేకంగా ఉంచుతారు. ఓటర్లు తమ పాత EPIC నంబర్లను కలిగి ఉంటారని ఎన్నికల సంఘం తెలిపింది.
