తెలంగాణ ఆర్టీసీ ఉచిత వైఫై, NewzFast Telugu (తెలంగాణ): తెలంగాణలోని బస్ స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే బస్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది.
ఇందులో భాగంగా 5 వేల మందికిపైగా ప్రయాణికుల రద్దీ ఉండే 86 బస్ స్టేషన్లను గుర్తించింది. వీటిలో దశలవారీగా ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నారు.
గుర్తించిన బస్ స్టేషన్లలో ఇప్పటికే ఒక్కో కంట్రోలర్‌ను నియమించినట్లు ఆర్టీసీ పేర్కొంది. ప్రయాణికులు బస్సుల వివరాలు, రాకపోకల సమయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసింది.
కొత్త టైమ్ టేబుల్ బోర్డులను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రయాణికుల భద్రతతో పాటు బస్ స్టేషన్లలో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు త్వరలో అన్ని బస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. వీటిని సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయానికి అనుసంధానించనున్నారు.
దీంతో బస్ స్టేషన్లలో పరిస్థితులను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
బస్ స్టేషన్లలో వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు సంస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.




