Telangana FTA global supply chain local industries, NewzFast Telugu (Hyderabad): రాష్ట్రంలోని స్థానిక పరిశ్రమలను అంతర్జాతీయ సరఫరా గొలుసుతో అనుసంధానించేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా సోమవారం హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించిన మెగా ఎఫ్‌టీఏ అవుట్ రీచ్ ప్రోగ్రామ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత్ వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా కొత్త అవకాశాలు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ఒప్పందాలను స్థానిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్‌తో తయారయ్యే నాణ్యమైన ఉత్పత్తులు ఎఫ్‌టీఏ భాగస్వామ్య దేశాలన్నింటికీ ఎగుమతయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని వివరించారు.
అదే సమయంలో, రాష్ట్రంలోని లక్ష మంది విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో పూర్తిగా ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించనున్నట్టు మంత్రి వెల్లడించారు. ఇందుకోసం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్) ప్రతినిధులు సచివాలయంలో మంత్రి సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు.
అంతర్జాతీయ ధ్రువీకరణ పరీక్షలు రాసేవారికి రాయితీ వోచర్లు ఇవ్వనున్నట్టు, కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థుల కోసం టాస్ ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మంత్రి చెప్పారు.


