ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026, NewzFast Telugu (హైదరాబాద్): ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, బ్యాటరీ టెక్నాలజీ, ఈవీ చార్జింగ్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలు తమ పరిశ్రమలను మరింత విస్తరించడంతో పాటు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించిన ఆటోమొబైల్, ఆటో కాంపొనెంట్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) రంగాల తొలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం బుధవారం సచివాలయంలో మంత్రి పొన్నం అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, డిసెంబరు 7 నుంచి 9 వరకు జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఆటోమొబైల్, ఈవీ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణను కాలుష్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రెండేళ్ల క్రితమే ఈవీ పాలసీని తీసుకొచ్చామని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ఆటోమొబైల్, మొబిలిటీ రంగాల అభివృద్ధికి మూడు పారిశ్రామిక పార్కులు, మొబిలిటీ క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన అవకాశాలున్నాయని, సమ్మిట్ విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.




