తెలంగాణ డీప్‌టెక్ ఆవిష్కరణల కేంద్రం, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్‌టెక్, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
బేగంపేట్‌లోని ఐటీసీ కాకతీయలో నిర్వహించిన ఫిక్కీ వందేళ్ల వేడుకలు, తెలంగాణ డీప్-టెక్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమం బుధవారం జరిగింది.
రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయబోయే ఏఐ, క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
2025-26లో రాష్ట్ర జీఎస్‌వీఏలో పారిశ్రామిక రంగం వాటా 8.1 శాతం వృద్ధి రేటుతో రూ.3.04 లక్షల కోట్లకు చేరిందని మంత్రి వెల్లడించారు. స్టేట్ మర్చండైజ్ ఎక్స్‌పోర్ట్స్ 39.3 శాతం పెరిగాయని ఆయన చెప్పారు.
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశ్రమలు, తయారీ రంగాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని శ్రీధర్‌బాబు వివరించారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సంస్థల సమష్ఠి భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు.
ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ఆవిష్కర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ తెలంగాణ చాప్టర్ చైర్మన్ వీవీ రామరాజు, కో చైర్మన్ జయదేవ్ మీలా, ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ జాయింట్ ఎండీ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

