తెలంగాణ అప్పులు, NewzFast Telugu (ఖమ్మం జిల్లా, తల్లాడ): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి 951 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీలకు చెందిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఈ పింఛన్లు మంజూరయ్యాయి.
ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి పథకాలను వివరించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పేదలకు ఆశించిన స్థాయిలో సంక్షేమం అందలేదని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్, సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, వైరా ఏఎంసీ చైర్మన్ బోళ్ల రంగారావు, గోవిందు శ్రీనివాసరావు, కే. వెంకటేశ్వర్లు, 27 గ్రామ పంచాయతీల సర్పంచులు, తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు.




