తల్లాడ అక్రమ వ్యాపారాలు, NewzFast Telugu (తల్లాడ, ఖమ్మం జిల్లా): వైరా అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ నోటిఫైడ్ పరిధిలోని తల్లాడ మండలంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న వ్యాపారాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యాపారాలపై మంగళవారం అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.
అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న ముగ్గురు వ్యాపారులకు సంబంధించిన బిల్లు బుక్కులను, ఇద్దరి బరువు తూచే కాటాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, వారి వద్ద నిల్వ ఉంచిన పత్తికి సంబంధించి రూ. 27,040 మార్కెట్ ఫీజును అక్కడికక్కడే వసూలు చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన సదరు వ్యాపారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇ. నరేష్ కుమార్ మాట్లాడుతూ, తల్లాడ పరిధిలో లైసెన్స్ లేకుండా ఎలాంటి వ్యాపారాలు సాగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
అనుమతులు లేని వ్యాపారులు వెంటనే సకాలంలో దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందాలని సూచించారు. లేనిపక్షంలో వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతులకు నష్టం చేకూర్చేలా అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఈ తనిఖీల్లో మార్కెట్ కమిటీ సహాయ కార్యదర్శి వి.
వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్ బి. విజయ కుమారి, డి.ఇ.ఓ పి.
ప్రభు దాసు, సెక్యూరిటీ గార్డులు కె. నాగభూషణం, జి.
సెల్వరాజ్, ఎండీ యాకూబ్ పాషా తదితరులు పాల్గొన్నారు.




