ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ, NewzFast Telugu: నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.
రెండో విడత ఎస్ఎస్ఆర్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలతో పాటు ఛండీగఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
అర్హులైన ఓటర్లను, ముఖ్యంగా యువకులు, కొత్త ఓటర్లను నమోదు చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం పేర్కొంది. 2027 ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే పౌరుల నుంచి ముందస్తు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 30న, తుది జాబితాను 2027 జనవరి 21న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
ఇదే సమయంలో ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ ‘ఈసీ నెట్’లో కొత్త ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన ఫామ్ 6 దరఖాస్తు నుంచి ఎస్ఐఆర్ కింద చేర్చిన డిక్లరేషన్ను పూర్తిగా తొలగించింది.
