శ్రీశైలం నాగార్జునసాగర్ కృష్ణా బోర్డు, NewzFast Telugu (హైదరాబాద్): కృష్ణా జలాల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి తొలుత ఆమోదించిన అసలు వివరాలను సమర్పించాలని కేఆర్ఎంబీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కోరింది.
ఈ మేరకు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్సీలకు బోర్డు లేఖ రాసింది. ప్రాజెక్టుల అసలు స్వరూపం, ఆ తర్వాత జరిగిన మార్పులు, అదనంగా చేపట్టిన పథకాలు, వాటికి లభించిన అనుమతుల వివరాలను ఆధారాలతో సహా అందించాలని స్పష్టం చేసింది.
ప్రధానంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి మూడు విభాగాల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని కేఆర్ఎంబీ కోరింది. ప్రాజెక్టుల తొలుత ఆమోదించిన పరిధి, భాగాలు, ఎడమ, కుడి కాలువల ఆఫ్‌టేక్‌లు, వాటి ఆయకట్టు, డిజైన్ డ్రాలు, కమాండ్ ఏరియాలు, నీటి అవసరాలు, సంబంధిత సాంకేతిక నివేదికలు, అనుమతి ఉత్తర్వులు అందించాలని సూచించింది.
సాగునీటి, విద్యుత్, తాగునీటి అవసరాల్లో చేసిన మార్పులు, విస్తరణలు, కొత్తగా చేర్చిన పథకాలు, వాటి డిజైన్, లక్ష్యాలు, అదనపు నీటి అవసరాలు, సాంకేతిక అంగీకారాలు, క్లియరెన్సులు, అనుమతుల వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది.
2026 అక్టోబర్ 15న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన లేఖలో కేడబ్ల్యూడీటీ-1 కేటాయింపులు, తొలుత ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలే ప్రామాణికంగా కొనసాగుతున్నాయని పేర్కొన్న విషయాన్ని బోర్డు తన తాజా లేఖలో ప్రస్తావించింది. ప్రాజెక్టుల పరిధిలో ఆ తర్వాత చోటుచేసుకున్న మార్పులను గుర్తించడానికి అసలు ఆమోదిత వివరాలు అత్యవసరమని స్పష్టం చేసింది.
శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో మార్పులు, విస్తరణల అంశం 2026 జనవరి 30న చైర్మన్ అధ్యక్షతన జరిగిన కమిటీ తొలి సమావేశంలో చర్చకు వచ్చినట్లు లేఖలో పేర్కొంది. 2021 జూలై 15న జారీ చేసిన నోటిఫికేషన్‌లో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 11, నాగార్జునసాగర్‌కు సంబంధించి రెండు నాన్-అప్పర్టినెంట్ కాంపోనెంట్లను ప్రస్తావించినట్లు తెలిపింది. నాగార్జునసాగర్‌కు సంబంధించిన అంశాలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని కూడా పేర్కొంది.
2026 సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 30 వరకు పలు లేఖల ద్వారా రెండు రాష్ట్రాలను అసలు ప్రాజెక్టు వివరాలు కోరినట్లు కేఆర్ఎంబీ గుర్తుచేసింది. అవసరమైన సమాచారం ఇంకా అందలేదని పేర్కొంది.
ఇదే తరహా వివరాలను నాగార్జునసాగర్‌కు సంబంధించి కూడా కోరినట్లు తెలిపింది.
అనుమతి లేని కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల్లో చేసిన మార్పులు, పెరిగిన నీటి అవసరాలపై సమీక్ష నిర్వహించేందుకు అసలు ఆమోదిత ప్రాజెక్టు వివరాలను ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఈ సమాచారం రెండు రాష్ట్రాల హక్కులు, అభ్యంతరాలకు భంగం కలిగించకుండా, సంబంధిత న్యాయస్థానాల్లో కొనసాగుతున్న విచారణలకు విఘాతం లేకుండా రికార్డులను పరిశీలించేందుకు అవసరమని పేర్కొంది.
తాజా లేఖతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అసలు అనుమతులు, తదుపరి మార్పులు, నీటి వినియోగంపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తున్నది.




