సోనియా ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం, NewzFast Telugu (హైదరాబాద్): కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’పై నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష రాశారు.
ఆయన ఈ పుస్తకాన్ని కేవలం రాజకీయ జ్ఞాపకాల సంకలనంగా కాకుండా, ఇటలీ నుంచి భారతదేశం వరకు సాగిన ఒక ప్రయాణంగా అభివర్ణించారు.
ఇటలీ నుంచి భారత్ వరకు
ఇటలీలో బాల్యం, కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీతో పరిచయం, ఆ తర్వాత భారత్‌కు రావడం, దేశాన్ని తన ఇంటిగా మార్చుకోవడం వరకు సోనియా గాంధీ జీవన ప్రయాణాన్ని ఈ పుస్తకం వివరిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కుటుంబ విషాదాలు, వ్యక్తిగత కోణం
సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలు దేశంతో పాటు ఒక కుటుంబాన్నీ కుదిపేశాయని, ఆ సంఘటనల వెనుక ఉన్న మానవీయ కోణాన్ని పుస్తకం చూపుతోందని ఆయన చెప్పారు. భార్యగా, తల్లిగా సోనియా వ్యక్తిగత జీవితాన్ని దేశ చరిత్రతో ముడిపెట్టి పుస్తకం చూపించిందని అన్నారు.
ఎన్నో వ్యక్తిగత దాడులు, విమర్శలు ఎదురైనప్పటికీ ఆమె సంయమనం, హుందాతనంతో వ్యవహరించారని ఆయన తెలిపారు.
క్లిష్ట సమయంలో పార్టీ నాయకత్వం
ఏళ్ల తరబడి రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకున్న సోనియా గాంధీ, చివరకు క్లిష్ట సమయంలో పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు చేపట్టి దిశానిర్దేశం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 2004లో ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు మద్దతు ఇవ్వడం ఆమె వ్యక్తిగత నిబద్ధతకు నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.
సమీక్షకుడి వ్యక్తిగత అనుభవం
తాను భారత వాయుసేనలో ఫైటర్ పైలట్‌గా రాష్ట్రపతి భవన్లో పనిచేస్తున్న సమయంలోనే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలను తొలిసారి కలిశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం సోనియా గాంధీ కల్పించారని, ఆరుసార్లు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఆమె వల్లే లభించిందని చెప్పారు.




