సోనియాగాంధీ ఆత్మకథ, NewzFast Telugu: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలైన నేపథ్యంలో, మాజీ ప్రధాని దివంగత పి.వి. నరసింహారావు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమైంది.
పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఈ అంశంపై సూటిగా ప్రశ్నలు సంధించారు. పీవీపై సోనియాకు గౌరవం ఉంటే ఆయన అంత్యక్రియలను దేశ రాజధాని ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదని ఆమె నిలదీశారు.
సోనియా ఆత్మకథలో పీవీతో తనకు విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలకు ఆయన అత్యంత ఆప్తుడని పేర్కొన్నట్టు మీడియా ద్వారా తెలిసిందని వాణీదేవి తెలిపారు. అయితే పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవ చేసి దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరగకపోవడం స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానికీ జరగలేదని ఆమె పేర్కొన్నారు.
దీనిని గౌరవంగా భావించాలా, అవమానంగా భావించాలా అని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు పీవీ మనవడు, బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ కూడా ఈ పుస్తకంపై తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మకథ అసత్యాల పుట్ట అని, చారిత్రక తప్పిదాలతో కూడి ఉందని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి, దేశానికి పీవీ నరసింహారావు అందించిన సేవలను పుస్తకంలో ఉద్దేశపూర్వకంగానే దాటవేశారని ఆయన ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులను మాత్రమే పైకి తెస్తూ, ఇతర ముఖ్య నేతలను కించపరచడం గాంధీ కుటుంబానికి అలవాటేనని సుభాష్ పేర్కొన్నారు.
ఈ పరిణామాలతో పీవీ పట్ల కాంగ్రెస్ వైఖరిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.




