సిరిసిల్ల కొత్త పెన్షన్లు, NewzFast Telugu (సిరిసిల్ల, తెలంగాణ): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.
వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి చేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
జిల్లాలో కొత్తగా 8,209 మందికి పెన్షన్లు మంజూరు చేసినట్లు ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19వ తేదీ నుంచి నూతన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కానుందని తెలిపారు.
ఇప్పటికే జిల్లాలో 1,13,264 మందికి పెన్షన్లు అందుతున్నాయని, కొత్త పెన్షన్లతో కలిపి మొత్తం 1,21,473 మందికి ప్రతి నెలా పెన్షన్లు అందనున్నాయి.
ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.25.97 కోట్లు ఖర్చు చేయనుందని ఆయన పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, మౌలిక సదుపాయాల కల్పనతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా బాధితులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల నుంచి నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి అర్హులను ఎంపిక చేసినట్లు వివరించారు.
ఈ నెల 18వ తేదీలోగా మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేస్తామని, 19వ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ అవుతుందని ఆమె వెల్లడించారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టే బాధ్యతలు అప్పగించామని, వయోవృద్ధుల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం త్వరలో అమల్లోకి రానుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆర్డీఓ, డీఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.




