సిద్ధిపేట రాజకీయం, NewzFast Telugu (సిద్ధిపేట, తెలంగాణ): తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి సిద్ధిపేటపైనే కేంద్రీకృతమైంది. దశాబ్దాలుగా మాజీ మంత్రి హరీశ్ రావుకు తిరుగులేని కంచుకోటగా, బీఆర్ఎస్ పార్టీకి గుండెకాయలా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్తరంగా మారింది.
ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీలు ఒకేసారి సిద్ధిపేటను తమ రాజకీయ వ్యూహాలకు కేంద్రబిందువుగా ఎంచుకున్నాయి. దీంతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఇటీవల కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, అభివృద్ధి వరాలు కురిపిస్తూనే రాజకీయంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా సిద్ధిపేటను ఎంచుకున్నారు.
ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని సిద్ధిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
ఇదే వేదికపై నుంచి ప్రతిష్టాత్మకమైన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. గతంలో సిరిసిల్లలో అనుసరించిన అభివృద్ధి, రాజకీయ దాడి ఫార్ములానే సిద్ధిపేటలోనూ అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నారు.
స్థానికంగా హరీశ్ రావు పట్టును సడలించడంతో పాటు, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ఎండగట్టాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
అయితే కాంగ్రెస్ సభకు ముందే సిద్ధిపేట రాజకీయాల్లోకి కవిత ప్రవేశించడం అనూహ్య పరిణామం. తన కొత్త పార్టీ కార్యకలాపాలను విస్తరించే క్రమంలో హైదరాబాద్, నిజామాబాద్ తర్వాత సిద్ధిపేటలో శాశ్వత పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి ఆమె శ్రీకారం చుట్టారు.
శుక్రవారం సర్వమత ప్రార్థనల అనంతరం భూమిపూజ నిర్వహించి, అక్కడి నుంచే తన రాజకీయ గళాన్ని వినిపించనున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తూనే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను, ముఖ్యంగా హరీశ్ రావు, కేటీఆర్‌లను ఆమె లక్ష్యంగా చేసుకుంటున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ఆమె చేస్తున్న విమర్శలు పరోక్షంగా కేసీఆర్ నాయకత్వాన్ని కూడా ప్రశ్నించేలా ఉన్నాయి.
ఇరువైపుల నుంచి వస్తున్న విమర్శల దాడులను ఎదుర్కోవడం బీఆర్ఎస్కు పెద్ద సవాలుగా మారింది. మరో ఏడాదిలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రత్యర్థుల వ్యూహాలకు దీటుగా సమాధానం చెప్పడంలో పార్టీ కొంత తడబడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ ముక్కోణపు రాజకీయ పోరులో హరీశ్ రావు తన కంచుకోటను ఎలా కాపాడుకుంటారు? రేవంత్, కవితల పర్యటనలు స్థానిక రాజకీయ సమీకరణాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయి?
అనేది తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.




