విత్తన వ్యాపారులు, NewzFast Telugu (కామారెడ్డి జిల్లా, తాడ్వాయి): అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విత్తన వ్యాపారులు కొత్త తరహా దోపిడీకి పాల్పడుతున్నట్లు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఆరోపణలు వెలుగుచూశాయి. నాసిరకం విత్తనాలు అంటగట్టడమే కాకుండా, అవి మొలకెత్తకపోయినా అసలుకు వడ్డీ కలిపి చెల్లించాలంటూ రూ.20 స్టాంప్ పేపర్లపై ఏకపక్ష ఒప్పందాలు రాయించుకున్నారని రైతులు చెబుతున్నారు.
మండలంలోని పలువురు రైతులు స్థానిక విత్తన వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే ఆ విత్తనాలు నాసిరకంగా ఉండటంతో భూమిలో వేసిన తర్వాత సుమారు 50 శాతం మేర మొలకెత్తలేదు.
దీంతో తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతులు ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడును వెల్లడించారు.
వ్యాపారుల మోసంపై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతోనే స్టాంప్ పేపర్ల ద్వారా జరుగుతున్న ఈ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది.
సాధారణంగా విత్తనాలు మొలకెత్తకపోతే కంపెనీలు లేదా డీలర్లు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి, లేదా అధికారులు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ వ్యాపారులు రూ.20 బాండ్ పేపర్లపై రాయించుకున్న ఒప్పందాల్లో అత్యంత కఠినమైన షరతులు విధించారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఒప్పందాల ప్రకారం పండిన పంటను క్వింటాల్‌కు రూ.7,500 చొప్పున అదే వ్యాపారికి అమ్మాలి. వేరే వారికి విక్రయిస్తే ఎకరాకు రూ.70,000 జరిమానా చెల్లించాలని, పంటను యంత్రాలు వాడకుండా చేతులతోనే కోయాలని నిబంధనలు పెట్టారని తెలుస్తోంది.
పంట పండినా, పండకపోయినా, విత్తనాలు మొలకెత్తకపోయినా విత్తనాల ఖరీదును వడ్డీతో సహా రైతులే చెల్లించాలని పేర్కొన్నారు.
రైతు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోతే, ఒప్పందంపై సంతకం చేసిన జమానాత్దారులను కూడా బాధ్యులను చేస్తూ నిబంధనలు పొందుపరిచారని బాధిత రైతులు చెబుతున్నారు.
ఫిర్యాదుతో కదిలిన మండల వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి, జిల్లా వ్యవసాయ అధికారులకు నివేదిక పంపినట్లు చెబుతున్నారు. అయితే బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో గానీ, అక్రమ ఒప్పందాలు చేసుకున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో గానీ ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో ఇలాంటి వ్యాపారం సాగుతున్నా మండల వ్యవసాయ శాఖ అధికారులకు కనిపించకపోవడంపై రైతు సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రైతులకు తక్షణమే న్యాయం చేసి, నకిలీ విత్తనాలు అంటగట్టిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.




