విత్తన వ్యాపారులు రైతులపై వడ్డీ షరతులు, NewzFast Telugu (కామారెడ్డి, తాడ్వాయి): ఆరుగాలం శ్రమించి పంట పండించే అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని విత్తన వ్యాపారులు సాగిస్తున్న కొత్త దోపిడీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో వెలుగులోకి వచ్చింది. నాసిరకం విత్తనాలు అంటగట్టడమే కాకుండా, అవి మొలకెత్తకపోయినా అసలుకు వడ్డీ కలిపి చెల్లించాల్సిందేనంటూ రూ.20 స్టాంప్ పేపర్లపై ఏకపక్ష ఒప్పందాలు రాయించుకోవడం కలకలం రేపుతోంది.
తాడ్వాయి మండల పరిధిలోని పలువురు రైతులు స్థానిక విత్తన వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేశారు. అయితే ఆ విత్తనాలు నాసిరకంగా ఉండటంతో భూమిలో వేసిన తర్వాత సుమారు 50 శాతం మేర మొలకెత్తలేదు.
దీంతో తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతులు ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గోడును వెల్లబోసుకున్నారు.
వ్యాపారుల మోసంపై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ స్టాంప్ పేపర్ దందా బయటపడింది. సాధారణంగా విత్తనాలు మొలకెత్తకపోతే కంపెనీలు లేదా డీలర్లు రైతులకు నష్టపరిహారం చెల్లించాలి, లేదా అధికారులు నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించే చర్యలు తీసుకోవచ్చు.
కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
వ్యాపారులు రూ.20 బాండ్ పేపర్లపై రాయించుకున్న ఒప్పందాల్లో అత్యంత కఠినమైన, విచిత్రమైన షరతులు విధించారు. పండిన పంటను క్వింటాల్‌కు రూ.7,500 చొప్పున సదరు వ్యాపారికే అమ్మాలని, వేరే వారికి విక్రయిస్తే ఎకరాకు రూ.70,000 జరిమానా చెల్లించాలని పేర్కొన్నారు.
అలాగే యంత్రాలు వాడకుండా చేతులతోనే కోయాలనే నిబంధనలు కూడా పెట్టారు.
పంట పండినా, పండకపోయినా, కనీసం విత్తనాలు మొలకెత్తకపోయినా విత్తనాల ఖరీదును వడ్డీతో సహా రైతులే చెల్లించాలని షరతు విధించారు. ఒకవేళ రైతు సకాలంలో డబ్బు చెల్లించలేకపోతే, ఒప్పందంపై సంతకం చేసిన జమానాత్దారులను కూడా బాధ్యులను చేస్తూ నిబంధనలు పొందుపరిచారు.
రైతుల ఫిర్యాదుతో కదిలిన మండల వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను పరిశీలించి, జిల్లా వ్యవసాయ అధికారులకు నివేదిక పంపినట్లు చెబుతున్నారు. అయితే బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించడంలో గానీ, అక్రమ ఒప్పందాలు చేసుకున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవడంలో గానీ పురోగతి కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయిలో ఇలాంటి వ్యాపారం సాగుతున్నా మండల అధికారులకు కనిపించకపోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, నకిలీ విత్తనాలు అంటగట్టిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలతో పాటు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.




