రెండో శనివారం సెలవులు రద్దు, NewzFast Telugu (శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్): ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్య వరుస తుఫానులు బీభత్సం సృష్టించాయి. తుఫానుల ధాటికి స్కూళ్లకు అసాధారణంగా సెలవులు ప్రకటించాల్సి వచ్చింది.
దీంతో పాఠశాలలు ఏటా పనిచేయాల్సిన పని దినాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు రెండో శనివారాల సెలవులను విద్యాశాఖ అధికారులు రద్దు చేస్తున్నారు. వరుసగా ఐదు నెలల పాటు ప్రతి నెలా రెండో శనివారాలు రద్దు చేస్తూ పలు జిల్లాల్లో ఉత్తర్వులు జారీ అవుతున్నాయి.
ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలోనూ స్కూళ్లకు రెండో శనివారం సెలవులు రద్దు చేశారు.
అర్నబ్ తుఫాన్ ప్రభావానికి గురైన శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలలకు ఈ నెల నుంచి మార్చి వరకు రెండో శనివారాల సెలవును రద్దు చేస్తూ విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తుఫాన్, భారీ వర్షాల కారణంగా ఇటీవల ప్రకటించిన సెలవులకు బదులుగా రెండో శనివారాల్లో పాఠశాలలు నడపాలని నిర్ణయించారు.
ఏయే తేదీల్లో ప్రకటించిన సెలవులకు పరిహారంగా ఏయే రెండో శనివారాల సెలవులు రద్దు చేస్తున్నారో జాబితా కూడా విడుదల చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 23, 24, అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. వీటికి బదులుగా ఈ నెల రెండో శనివారమైన 14వ తేదీన పాఠశాలలు పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చారు.
అలాగే డిసెంబర్ 12న కూడా రెండో శనివారం స్కూళ్లు పనిచేయాలని ఆదేశించారు.
జనవరిలో రెండో శనివారం సంక్రాంతి సెలవుల్లోకి రావడంతో దానిని వదిలేశారు. ఫిబ్రవరి 13, మార్చి 13 తేదీల్లో వచ్చే రెండో శనివారాల సెలవులు కూడా ఇదే విధంగా రద్దు చేశారు.
చివరిగా ఐదో సెలవు దినాన్ని ఏప్రిల్‌లో ఖరారు చేయాల్సి ఉంది.
ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు సహా అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించారు.




