సర్పంచ్ ఎన్నికలు నామినేషన్ కేంద్రాలు, NewzFast Telugu (శ్రీకాకుళం): జిల్లాలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం పలుచోట్ల ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు.
సంతబొమ్మాళి మండలంలో మూడో విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 34 పంచాయతీల పరిధిలో నామినేషన్ల స్వీకరణకు 10 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో పార్వతీశం ఒక ప్రకటనలో తెలిపారు. కాపుగోదాయవలస, సంతబొమ్మాళి పంచాయతీలకు సంతబొమ్మాళిలో, ఆకాశలక్కవరం, హనుమంతు నాయుడుపేట, యామలపేట పంచాయతీలకు హనుమంతునాయుడుపేటలో కేంద్రాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
పోలాకి మండలంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తొమ్మిది నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలాకి సచివాలయంతో పాటు పలు సచివాలయ పరిధుల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
ఈనెల 26న తొలి విడతలో జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలు మూడో విడత డిసెంబరు రెండో తేదీకి వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.
హిరమండలం మండలంలో 23 పంచాయతీల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు కేంద్రాలను అధికారులు ఖరారు చేశారు. ఎం.అవలంగి జడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు సుభలయ జడ్పీ ఉన్నత పాఠశాల, ఎంఎల్పురం సచివాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో కాళీప్రసాదరావు తెలిపారు.
జలుమూరు మండలంలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు ఐదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో బి.చిన్నమ్మడు తెలిపారు. శ్రీముఖలింగం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
ఒక్కో కేంద్రంలో ఇద్దరు ఆర్వోలను నియమించగా, ప్రతి ఆర్వో నాలుగు పంచాయతీల నామినేషన్లను స్వీకరిస్తారని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె.రామారావు, డిప్యూటీ ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఎస్ఐ బి.అశోక్బాబు పాల్గొన్నారు.




