సాకిబ్ ఖాన్, NewzFast Telugu (రావల్పిండి): పాకిస్థాన్ యువ పేసర్ సాకిబ్ ఖాన్ తన తొలి టెస్టులోనే అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి తన డెబ్యూ మ్యాచ్‌ను మెమరబుల్‌గా మార్చుకున్నాడు.
సాకిబ్ అద్భుత బౌలింగ్‌తో భారీ ఆధిక్యం దిశగా సాగుతున్న శ్రీలంక జట్టుకు పాకిస్థాన్ బ్రేక్ వేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ధనంజయ డి సిల్వా, కుసల్ మెండిస్ సెంచరీలతో క్రీజులో ఉండటంతో శ్రీలంక భారీ ఆధిక్యం సాధించడం ఖాయంగా కనిపించింది.
అయితే, నాలుగో రోజు ఆట ప్రారంభమైన వెంటనే అరంగేట్ర బౌలర్ సాకిబ్ ఖాన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. రోజు తొలి ఓవర్‌లోనే ధనంజయ డి సిల్వాను 167 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు.
దీంతో ఐదో వికెట్‌కు నమోదైన 249 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. పాకిస్థాన్‌తో టెస్టుల్లో శ్రీలంక తరఫున ఐదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
ఆ తర్వాత మరో సెంచరీ వీరుడు కుసల్ మెండిస్‌ను కూడా సాకిబ్ వదల్లేదు. 119 పరుగులు చేసిన మెండిస్‌ను వికెట్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఈ రెండు కీలక వికెట్లతో పాక్ బౌలర్లు తిరిగి మ్యాచ్‌పై పట్టు సాధించారు.
అనంతరం సోనల్ దినూష 20 పరుగులతో పోరాడినా సాకిబ్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.
ఆ తర్వాత కింది వరుస బ్యాటర్లను కూడా వరుసగా పెవిలియన్‌కు పంపిన ఈ యువ పేసర్ తన ఐదు వికెట్ల ఘనతను దాటి ఏడు వికెట్ల ప్రదర్శనను నమోదు చేశాడు. ఒక దశలో 404/4తో పటిష్టంగా కనిపించిన శ్రీలంక చివరకు 446 పరుగులకే ఆలౌటైంది.
సాకిబ్ ఖాన్ 34 ఓవర్లు బౌలింగ్ చేసి 130 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. టెస్టు అరంగేట్రంలో పాకిస్థాన్ బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది నాలుగో స్థానంలో నిలిచింది.
ఇంతకంటే మెరుగైన గణాంకాలను మహమ్మద్ జాహిద్ (7/66), మహమ్మద్ నజీర్ (7/99), అబ్రార్ అహ్మద్ (7/114) మాత్రమే నమోదు చేశారు.




