ఇసుక సిండికేట్ వార్, NewzFast Telugu (వరంగల్ జిల్లా, నర్సంపేట): నర్సంపేట నియోజకవర్గానికి ఇసుక తరలింపు వ్యవహారం రెండు యూనియన్ల మధ్య వివాదంగా మారింది. ఏళ్లుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తున్నామని ఒక వర్గం చెబుతుండగా, స్థానికంగా తమకు ప్రాధాన్యం ఇవ్వాలని మరో వర్గం డిమాండ్ చేస్తోంది.
ఈ ఘర్షణ కారణంగా డివిజన్ వ్యాప్తంగా ఇండ్లు, వ్యాపార సముదాయాల నిర్మాణానికి ఇసుక సరఫరాలో సమస్యలు ఏర్పడుతున్నాయి. మెజారిటీగా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక లభ్యతపై ప్రభావం పడుతోందని, స్థానికంగా ఇసుక డంప్ స్థావరాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సంపేట పట్టణానికి ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, రాజుపేట సహా సుమారు పది ప్రాంతాల నుంచి ఇసుక నిత్యం తరలిస్తున్నారు. లారీలు, పెద్ద టిప్పర్లు ద్వారా ఈ వ్యాపారంపై వందల మంది ఆధారపడి ఉన్నారు.
ఇందులో నర్సంపేటకు చెందిన పలువురు లారీ యజమానులు కూడా ఉన్నారు.
గత కొంతకాలంగా దూర ప్రాంతాల నుంచి వస్తున్న వాహనాలపై స్థానిక వాహన యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ, తమ యూనియన్లో చేరాలని సూచిస్తున్నారు.
సుదూర ప్రాంతాల నుంచి ఇసుక తరలించడం ఆర్థికంగా భారంగా మారిందని వారు చెబుతున్నారు.
మల్లంపల్లి యూనియన్ వాదన ప్రకారం, గత 15 ఏళ్లుగా ములుగు జిల్లా నుంచి నర్సంపేటకు ఇసుక తరలిస్తున్నామని, ఇసుక రీచ్ నుంచి డెలివరీ పాయింట్ వరకు నిర్ణయించి, వే బిల్లు ఆధారంగా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నామని చెబుతోంది. ఇటీవల నర్సంపేటలో స్థానిక సమస్యలు ఎదురవుతున్నాయని కూడా వారు పేర్కొంటున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనలో నర్సంపేట పట్టణంలో ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద టన్నుకు సుమారు రూ.1000 నుంచి రూ.1100 వరకు అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది వినియోగదారులకు కొంత ఉపశమనంగా ఉన్నప్పటికీ, స్థానిక లారీ యజమానులు ఈ ధరను వ్యతిరేకిస్తూ, తమ లారీలను అడ్డగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
నర్సంపేట యూనియన్ వైపు నుంచి శ్రీ మహాలక్ష్మి టిప్పర్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తిని రాజేందర్ మాట్లాడుతూ, ఈ అసోసియేషన్లో సుమారు 30 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. మల్లంపల్లి యూనియన్ లారీలు కూడా ఇక్కడ ఇసుక విక్రయించుకోవచ్చని, అయితే అందుకు తమ యూనియన్లో చేరి రూ.500 చెల్లించాలని స్పష్టం చేశారు.
ఈ యూనియన్ల మధ్య వివాదంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక యూనియన్ టన్నుకు రూ.1000-1100 వరకు విక్రయిస్తుండగా, స్థానిక లారీ యజమానులు రూ.1200 వరకు అమ్ముతున్నట్లు సమాచారం.
ధరల పెరుగుదల కారణంగా ఇసుక నిల్వ చేసి విక్రయించే యజమానులు కూడా ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇరు యూనియన్ల మధ్య పరిస్థితి చాప కింద నీరులా మారిందని, ఒకరి లారీలను మరొకరు అడ్డగించే పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రచారం జరుగుతోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఇరు వర్గాల బాధ్యులు చెబుతున్నప్పటికీ ఇంకా ముందడుగు పడలేదు.
నర్సంపేట యూనియన్ చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతుండగా, మల్లంపల్లి యూనియన్లోని కొందరు సభ్యులు సమస్యను పెద్దది చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని ఇరు వర్గాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.




