సహారన్పూర్ పెళ్లి పత్రిక వివాదం, NewzFast Telugu (ఉత్తరప్రదేశ్, సహారన్పూర్): ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్ జిల్లాలో ఒక ఆసక్తికరమైన, సంచలన ఘటన వెలుగుచూసింది. ఇద్దరు ముస్లిం సోదరీమణుల వివాహ ఆహ్వాన పత్రికలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వారికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్నాయి.
వరులిద్దరూ ముస్లింలే అయినప్పటికీ, పెళ్లి పత్రికలలో వారి పేర్లు హిందూ పేర్లలా ఉండటమే ఈ వివాదానికి కారణమైంది. సహారన్పూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు ముస్లిం యువతులకు నవంబర్ 12న వివాహం నిశ్చయమైంది.
ఈ మేరకు కుటుంబ సభ్యులు పెళ్లి పత్రికలు ముద్రించి బంధువులకు పంచిపెట్టారు.
అయితే, ఆ పత్రికల్లో వరుల పేర్లు హిందూ సంస్కృతికి చెందిన పేర్లలా ఉండటంతో ఎవరో వాటిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఆ వెడ్డింగ్ కార్డ్స్ నెట్టింట వైరల్గా మారాయి.
కార్డులు వైరల్ అయిన తర్వాతి నుంచే వివాదం మొదలైంది.
వివాహ వేడుకల కోసం బుక్ చేసుకున్న గార్డెన్ యజమానికి ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడు. ఈ పెళ్లి వేడుకలను తమ వేదికపై నిర్వహిస్తే హిందూ సంస్థల ప్రతినిధులతో వచ్చి తీవ్రంగా గొడవ చేస్తామని బెదిరించినట్లు వధువుల కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ బెదిరింపులతో భయాందోళనకు గురైన మండపం యజమాని పెళ్లికి వేదిక ఇచ్చేందుకు వెనకాడుతుండటంతో ఏర్పాట్లు నిలిచిపోయాయి.
ఈ వివాదంపై వధువుల సోదరుడు మహ్మద్ షకీల్ స్పందిస్తూ, “మేము ముస్లింలమే, పెళ్లి చేసుకోబోయే అబ్బాయిల కుటుంబం కూడా ముస్లిమే. కానీ, వరుల కుటుంబంలో తరతరాలుగా పిల్లలకు హిందూ పేర్లు పెట్టే సాంప్రదాయం నడుస్తోంది.
ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు” అని స్పష్టం చేశారు.
వధువుల తల్లి సుల్తాన్ మాట్లాడుతూ, ఇరు కుటుంబాల పూర్తి సమ్మతితోనే ఈ వివాహాలు జరుగుతున్నాయని తెలిపారు. తమ పెద్ద కుమార్తెను కూడా గతంలోనే ఇదే కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేశామని, ఆ కుటుంబంలో తరతరాలుగా ఇటువంటి పేర్లే వాడుకలో ఉన్నాయని వివరించారు.
సమయానికి వివాహం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని గుర్తించి తగిన రక్షణ కల్పించాలని కోరుతూ ఇద్దరు వధువులు స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సర్కిల్ ఆఫీసర్ శైలేంద్ర ప్రతాప్ గౌతమ్ స్పందిస్తూ, ఫిర్యాదు స్వీకరించామని, బెదిరింపు ఫోన్ కాల్స్ అంశంపై పూర్తి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.




