సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలి, NewzFast Telugu (నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని 9వ డివిజన్ పరిధిలో సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీకి లింక్ రోడ్డు నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సాగర్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి వెంకటరమణ కాలనీ వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.
అయితే ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాగర్ రోడ్డు నుండి వెంకటరమణ కాలనీ, వసుంధర కాలనీ, పటేల్ నగర్, సూర్యవంశం కాలనీ, చైతన్యపురి కాలనీలకు అనుసంధాన రహదారి లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కేవలం 100 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపడితే ఈ కాలనీల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన స్థలాన్ని కేటాయించి, లింక్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు భువనగిరి దేవేందర్, 9వ డివిజన్ కార్పొరేటర్ దీప్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
