శబరిమల ట్రాన్స్‌జెండర్ ఆలయ ప్రవేశం, NewzFast Telugu (కేరళ): శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటూ ఓ ట్రాన్స్‌జెండర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. పిటిషనర్ తన లింగాన్ని స్పష్టంగా నిర్ధారించే వైద్య లేదా అధికారిక ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోతే ఆలయంలోకి అనుమతించే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ఈ అంశంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తీసుకున్న నిర్ణయానికే తాము కట్టుబడి ఉన్నామని కేరళ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన సత్యశ్రీ షర్మిళ రహమతాలి అనే ట్రాన్స్‌జెండర్ మహిళ శబరిమల దర్శనానికి అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
తాను అయ్యప్ప భక్తురాలినని, ఆచారాల ప్రకారం మాల ధరించి గతంలో జనవరి 3, ఏప్రిల్ 15 తేదీల్లో స్వామివారిని దర్శించుకున్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం క్రతువులు పూర్తి చేసిన ట్రాన్స్‌జెండర్లకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఆమె కోరారు.
ఈ పిటిషన్‌పై ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోర్టుకు తన వాదనలు వినిపించింది. ఒక వ్యక్తి మహిళా లేక ట్రాన్స్‌జెండరా అన్నది తేల్చే అధికారం గానీ, వారి శారీరక లక్షణాలను పరిశీలించే హక్కు గానీ తమకు లేదని బోర్డు స్పష్టం చేసింది.
చట్టబద్ధమైన వైద్య సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్ సమర్పిస్తేనే అనుమతిపై ఆలోచించగలమని, లేనిపక్షంలో అది ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమవుతుందని పేర్కొంది.
శబరిమల ఆలయ ప్రవేశానికి సంబంధించిన కీలక అంశాలపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నందున, ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు వైఖరికి భిన్నంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కేరళ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
గత వివాదం ఇలా ఉంది. గతంలో రెండుసార్లు శబరిమలకు వెళ్లిన పిటిషనర్ ఆగస్టు 20న మరోసారి యాత్రకు బయలుదేరారు.
అయితే పంబా గణపతి ఆలయం వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు ఆమెను అడ్డుకుని ఆలయ నిబంధనలను వివరించారు. ఆ తర్వాత ఆగస్టు 26న తిరువోణం పర్వదినం సందర్భంగా దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె కేరళ చీఫ్ సెక్రటరీ, ఉన్నత పోలీసు అధికారులు, టీడీబీ అధికారులకు వినతిపత్రాలు అందించారు.
దీనిపై స్పందించిన అధికారులు, తమిళనాడులోని అధికారుల నుంచి జారీ అయిన లింగ మార్పిడి, వైద్య స్థితి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించినట్లు టీడీబీ కోర్టుకు తెలిపింది.




