రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన, NewzFast Telugu (కొడంగల్, వికారాబాద్ జిల్లా): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్పోను ప్రారంభించనున్నారు.
నవంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ పర్యటనలో దాదాపు రూ. 9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. తొలి రోజు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో రైతు మేళాను సందర్శించి, ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖిలో పాల్గొంటారు.
రెండో రోజు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం జరగనుంది. ఎకోపామ్ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడంతో పాటు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను ప్రారంభించనున్నారు.
బొంరాస్‌పేట, కొడంగల్, దుద్యాలలో పోలీస్ స్టేషన్ భవనాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సమీకృత మండల కార్యాలయ భవనం ప్రారంభోత్సవాలు ఉన్నాయి. కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ. 5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్ రోడ్డు-2కు శంకుస్థాపన చేయనున్నారు.
కోస్గిలో సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవం, దౌల్తాబాద్‌లో ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాల ప్రారంభోత్సవాలు కూడా ఈ షెడ్యూల్లో ఉన్నాయి. చివరి రోజు హకీంపేటలో రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
ఈ సభకు రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
