రేగోడ్ మహిళ అదృశ్యం, NewzFast Telugu (మెదక్ జిల్లా, తెలంగాణ): మెదక్ జిల్లా రేగోడ్ మండలంలోని మర్పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అదృశ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మర్పల్లి గ్రామానికి చెందిన మన్నె రేణుక (26) భర్త మరణించడంతో తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జోగిపేటలో నివాసం ఉంటోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీన మర్పల్లిలోని తన ఇంటికి వచ్చింది.
ఈ నెల 9వ తేదీన తన ఇద్దరు కూతుళ్లు నిఖిత (5), నిత్యశ్రీ (3)లతో కలిసి జోగిపేటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. అయితే, వారు జోగిపేటకు చేరుకోకపోవడంతో రేణుక మామ కిష్టయ్య, కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి వెతికారు.
బంధువులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినప్పటికీ తల్లి, ఇద్దరు చిన్నారుల ఆచూకీ లభించలేదు. దీంతో కిష్టయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదృశ్యమైన ముగ్గురి కోసం గాలింపు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.




