రాప్తాడు బాలిక గోపిక ఆరోగ్య పరిస్థితి, NewzFast Telugu: రాప్తాడు ఉన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలిక గోపిక ఆరోగ్య పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ సాయం లేకుండానే శ్వాస తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో గోపికకు చికిత్స కొనసాగుతోంది. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌ను తొలగించారు.
వైద్యులు పిలిచినప్పుడు ఆమె ఒక్కో పదంతో స్పందిస్తూ మాట్లాడుతోందని మంత్రి తెలిపారు.
పీఐసీయూలో హైఫ్లో ఆక్సిజన్ సాయాన్ని వైద్యులు క్రమంగా తగ్గిస్తున్నారు. గోపిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు మంత్రి పేర్కొన్నారు.
ముక్కు ద్వారా అందిస్తున్న ఆహారాన్ని బాలిక సజావుగా స్వీకరిస్తోందని, రక్తహీనత కారణంగా రక్తమార్పిడి కూడా చేసినట్లు వివరించారు. అవయవాల కదలికల కోసం ఫిజియోథెరపీ, ఛాతీ వ్యాయామాలు అందిస్తున్నారు.
యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులతో పాటు అవసరమైన ఇతర సహాయక చికిత్సలు కొనసాగుతున్నాయి. వైద్య బృందం ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని మంత్రి వెల్లడించారు.


