రైతు గర్జన నిర్మల్, NewzFast Telugu (నిర్మల్): నిర్మల్ గడ్డపై బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన మహాసభ విజయవంతమైంది. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిర్వహించిన ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రైతులు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో నిర్మల్ పట్టణం జనసంద్రంగా మారింది. ఎన్టీఆర్ మినీ స్టేడియం సభా ప్రాంగణం కిక్కిరిసిపోగా, లోపల చోటు దొరకక వేలాది మంది రోడ్లపై నిలబడి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దాదాపు గంటపాటు ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం ప్రజల నుంచి చప్పట్లు, హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.
మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేటీఆర్ ప్రస్తావించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటిలో ఏ ఒక్కటైనా అమలైందా అని ప్రజలను ప్రశ్నించగా, సభకు హాజరైనవారు కాలేదని స్పందించారు.
రైతుబంధు పథకం రద్దు విషయంలో రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను సభా వేదికపై ప్రదర్శించారు. మూడేళ్లలో మూడుసార్లు రైతుబంధు నిలిపివేశారని కేటీఆర్ ఆరోపించగా, సభలో ప్రజలు నినాదాలతో స్పందించారు.
సభ ముగిసిన తర్వాత కూడా కేటీఆర్ వ్యాఖ్యలపై పట్టణంతోపాటు పల్లెల్లో చర్చ కొనసాగుతోంది. సభ క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఈ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.




