వ్యవసాయ పాడిపంటలు మాసపత్రిక, NewzFast Telugu (తెలంగాణ): రైతులకు సాగు సమాచారం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటలపై సూచనలు అందించాల్సిన వ్యవసాయ శాఖ తన ప్రత్యేక గుర్తింపు ఉన్న ‘వ్యవసాయ పాడిపంటలు’ మాసపత్రిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
83 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ పత్రిక ప్రతి నెల మొదటి వారంలోనే రైతుల చేతికి చేరాల్సి ఉండగా, 18, 20 తేదీల్లో విడుదల చేస్తున్నట్టు పాఠకులు చెబుతున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన సంచిక ఈ నెల 20వ తేదీ తర్వాత వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం.
ప్రస్తుతం నవంబర్ 12వ తేదీ వచ్చినా ఆ నెల సంచిక రైతులకు చేరకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెబ్సైట్లో ఆలస్యంగా అప్లోడ్ చేయడమే కాకుండా, వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు చేరిన ముద్రిత ప్రతులు కూడా కొన్నేళ్లుగా అందడం లేదని రైతులు చెబుతున్నారు.
వ్యవసాయ శాఖ అధికారిక వాట్సాప్ చానల్లోనూ నెల మొదట్లో అందాల్సిన సమాచారం ఆలస్యంగా వస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
2019-20 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికలో నెలకు 46 వేల పాడిపంటలు కాపీలు ముద్రించి, 32 జిల్లాల వ్యవసాయాధికారుల ద్వారా రైతు సమన్వయ సమితులు, ప్రగతిశీల రైతులు, గ్రామపంచాయతీలు, అనుబంధ కార్యాలయాలకు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పంపిణీ వ్యవస్థ కొనసాగుతోందా, కొనసాగకపోతే కారణమేంటి అన్నది వ్యవసాయ శాఖ స్పష్టం చేయాల్సి ఉంది.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో రైతాంగం సతమతమవుతోంది. యాసంగిలో ఏ పంటలు వేయాలి, నీటి లభ్యతను బట్టి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి, చీడపీడల నివారణకు ఏ చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు అవసరం.
ఈ సమయంలో వ్యవసాయ శాఖ రూపొందిస్తున్న ఎల్నినో వీక్లీ బులెటిన్ ఇంగ్లీష్లోనే అందుబాటులోకి వస్తోందని, తెలుగు మాత్రమే చదవగలిగే రైతులకు అది ఉపయోగపడటం లేదని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ముద్రణ, పంపిణీ లోపాలను సరిదిద్దాలని, ప్రతి నెల మొదటి వారంలోనే పత్రికతో పాటు తెలుగులోనే వాతావరణ బులెటిన్లు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.




