రైతు ప్రయోజనాలు, NewzFast Telugu (ఎల్లారెడ్డిపేట, తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యంలో రైతు ప్రయోజనాలే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
రాష్ట్రంలోని 1.06 కోట్ల మందికి ‘ఇందిరాగాంధీ జీవిత బీమా పథకం’ వర్తించేలా సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభలో ప్రకటన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
కమిటీ సభ్యులను సన్మానించిన ఆయన, రైతులను రారాజులను చేయాలన్న సంకల్పంతో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తూ, వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టి వారి ఫామ్‌హౌస్‌ల్లో వరి పంటలు సాగు చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందించిందని ఆయన తెలిపారు. ఎల్‌నినో ప్రభావం తెలంగాణలోనే ఉందని హరీష్‌రావు, కేటీఆర్ మాట్లాడుతున్నారని, అయితే అది వంద దేశాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు.
కమిటీ సభ్యులు రైతులకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేయాలని కోరారు.
ఈ నెల 19న సిద్దిపేటలో జరిగే సీఎం రేవంత్‌రెడ్డి సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో అప్పుల భారం పెరిగిందని ఆయన ఆరోపించారు.
డెభ్బై ఏళ్లలో 13 మంది ముఖ్యమంత్రులు సంక్షేమ పథకాలు, జలాశయాల నిర్మాణాల కోసం రూ.75 వేల కోట్ల అప్పు చేశారని, దానికి ఏటా రూ.6 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి ఉండేదని తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8.12 లక్షల కోట్ల అప్పు పెరిగి, రాష్ట్రం నెలకు రూ.6 వేల కోట్ల వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చిందని ఆయన ఆరోపించారు.
ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గీతాంజలి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దేవానందం, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.




