ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, NewzFast Telugu (తాండూరు రూరల్, రంగారెడ్డి జిల్లా): ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని, దానిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
విద్యార్థులను వారి సమస్యలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన సమతుల్య ఆహారం అందించడంతో పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అల్పాహారం, మధ్యాహ్న భోజన కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు.
విద్యార్థుల కోసం ఎంత ఖర్చు చేసినా అది ఖర్చు కాదని, భావితరాల భవిష్యత్తు కోసం పెట్టే గొప్ప పెట్టుబడని ఆయన అన్నారు. నేటి విద్యార్థులపై పెట్టే ప్రతి రూపాయి రేపటి సమాజ అభివృద్ధికి పునాది అవుతుందన్నారు.
అనంతరం మండల పరిధిలోని జుంటుపల్లి గ్రామంలో రూ.50.95 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం 735 స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన లబ్ధిదారులకు వారి గ్రామాలకే వచ్చి స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నామని తెలిపారు.
జుంటుపల్లి సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్ల నిధులతో ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. జుంటుపల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు 3,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.




