పీవీ నర్సింహారావు, NewzFast Telugu (హైదరాబాద్): మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ విడుదల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు.
ఆమె చెప్పిన ప్రకారం, ఆత్మకథలో సోనియా గాంధీ పీవీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని పేర్కొన్నారని మీడియా ద్వారా తెలిసిందని వాణీదేవి తెలిపారు. అయితే పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవ చేసిన, దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ అంత్యక్రియలను న్యూఢిల్లీలో ఎందుకు జరపలేదని ఆమె ప్రశ్నించారు.
స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానికీ ఇలా జరగలేదని, దీనిని గౌరవంగా భావించాలా లేక అవమానంగా భావించాలా అనేది పాఠకులే చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు.
పీవీ నర్సింహారావు తీసుకొచ్చిన విదేశాంగ విధానం, పారిశ్రామిక, విద్య, ఆర్థిక రంగాల్లో సంస్కరణల ఫలాలను దేశ ప్రజలందరూ అనుభవిస్తున్నారని వాణీదేవి పేర్కొన్నారు. నేడు ప్రపంచ పటంలో భారత్ అగ్రగామిగా కొనసాగుతోందంటే అది నాటి పీవీ ఆర్థిక సంస్కరణల ఫలితమేనని ఆమె గుర్తుచేశారు.
అయితే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎప్పుడూ మాట్లాడలేదని, ఒక ప్రశంస కూడా తాను వినలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పీవీ శతజయంతి తమ కుటుంబానికి ప్రత్యేకమైనదని వాణీదేవి చెప్పారు. అంతటి మహావ్యక్తి పేరిట ఢిల్లీలోనైనా మరెక్కడైనా పార్టీ పరంగా కనీసం ఒక స్మారకోపన్యాసం కూడా ఏర్పాటు చేయకపోవడంలోని ఆంతర్యమేమిటని ఆమె ప్రశ్నించారు.
ఆయనతో సంబంధం లేని ఇతర పార్టీలు ఆయన గొప్పతనాన్ని గుర్తించి ప్రశంసించాయని ఆమె పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆయనకు భారతరత్న ప్రదానం చేసిందని, అంతకుముందు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ చొరవతో 360 రోజుల పాటు శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పీవీ జీవించి ఉన్న కాలంలో లేని పార్టీ అయినప్పటికీ, ఆయనను గౌరవిస్తూ భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని వాణీదేవి తెలిపారు. ఆయన గౌరవార్థం తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించారని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఎవరు నిజంగా ఆయనను గౌరవిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు.
ఇదే అంశంపై పీవీ మనుమడు ఎన్వీ సుభాష్ తిరువనంతపురంలో పీటీఐతో మాట్లాడుతూ, సోనియా గాంధీ రాసిన ఆత్మకథను ‘అబద్ధాల పుట్ట’గా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి పీవీ అందించిన సహకారాన్ని సోనియా గాంధీ ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని ఆయన విమర్శించారు.
మరోవైపు మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ తన ఆత్మకథలో తెలంగాణ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చిన ఈ చారిత్రక ఘట్టాన్ని విస్మరించడమే కాకుండా, పుస్తకంలో ‘తెలంగాణ’ అనే పదాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన తెలిపారు.




