పురందేశ్వరి, NewzFast Telugu (రాజమండ్రి): స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, బీజేపీ కూటమిలో భారంగా మారిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఘాటుగా స్పందించారు. కూటమిలో ఉంటూ బీజేపీకి తగిన బలం లేదని, సమన్వయ లోపం వల్లే నష్టం జరిగిందన్న విమర్శలను ఆమె గణాంకాలతో తిప్పికొట్టారు.
ఎన్నికల్లో సాధించిన విజయాలన్నీ భాగస్వామ్య పక్షాల ఖాతాలోకి వేస్తూ, ఎదురైన కొన్ని వైఫల్యాలకు కేవలం బీజేపీనే బాధ్యురాలిని చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. గెలుపు కూటమి సమష్టి విజయమైనప్పుడు, ఓటమికి కూడా అన్ని పార్టీలు సమష్టిగానే బాధ్యత వహించాలని పేర్కొంటూ, మిత్రపక్షాల తీరుపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు.
కూటమి భాగస్వామ్య పార్టీల నుంచి తమకు ఎలాంటి సహకారం అందిందో అట్టడుగు స్థాయి కార్యకర్తలకు పూర్తిగా తెలుసని ఆమె పేర్కొన్నారు. కొన్నిచోట్ల తీవ్ర అవమానకరమైన, కించపరిచే పరిస్థితులు ఎదురైనప్పటికీ, వాటన్నింటినీ భరించి బీజేపీ కార్యకర్తలు, అభ్యర్థులు అద్భుత విజయాలు నమోదు చేశారని గుర్తుచేశారు.
సమన్వయంలో తలెత్తిన సమస్యలను దాచిపెట్టేది లేదని, వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె తేల్చిచెప్పారు.
మీడియా, సోషల్ మీడియాలో బీజేపీ ఓటములపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి దుష్ప్రచారం జరుగుతోందని ఆమె విమర్శించారు. బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో 59 శాతానికి పైగా విజయాలు సాధించిందని, ఇది క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలానికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.
ఉదాహరణగా రాజమండ్రి జిల్లా పరిధిలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, రాజమండ్రి రూరల్ స్థానాలను నూటికి నూరు శాతం గెలుచుకున్నామని, అనపర్తిలో 11 స్థానాలకు గాను 10 స్థానాల్లో విజయం సాధించామని వివరించారు.
బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యకర్తలు చెమటోడ్చి పార్టీని బలోపేతం చేశారని పురందేశ్వరి పేర్కొన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలను చిన్నచూపు చూడకుండా, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయ పనుల్లో వారికి అండగా ఉంటూ గౌరవించాలని సూచించారు.
పదవులు రాగానే అహంకారం ప్రదర్శించకుండా కార్యకర్తలను సమానంగా చూడాలని, రాబోయే 10-15 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త నాయకత్వాన్ని తయారు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.




