పీటీ ఉష, NewzFast Telugu: ఇండియా ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు తీవ్ర నిరాశ ఎదురైంది. మహిళల స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ మెరిట్(ఎస్ఓఎమ్) ఎన్నికల్లో ఆమె అనూహ్యంగా ఓటమిపాలయ్యారు.
నాలుగు ఎస్ఓఎమ్ స్థానాల కోసం ఆరుగురు బరిలో నిలిచారు. భారత మాజీ బ్యాడ్మింటన్ స్టార్, హైదరాబాద్ దిగ్గజం సైనా నెహ్వాల్, మాజీ లాంగ్ జంప్ ప్లేయర్ అంజు బాబీ జార్జ్, ఆర్చరీ దిగ్గజం డోలా బెనర్జీ, హాకీ లెజెండ్ రాణి రాంపాల్ విజేతలుగా నిలిచారు.
ఈ ఎన్నికలో పీటీ ఉష 40 ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. 40 మంది పురుష క్రీడాకారులు, 40 మంది మహిళా అథ్లెట్లు ఓటింగ్లో పాల్గొనగా, అంజు బాబీ జార్జ్ అత్యధికంగా 53 ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. రాణి రాంపాల్కు 50 ఓట్లు, డోలా బెనర్జీకి 45, సైనా నెహ్వాల్కు 43 ఓట్లు వచ్చాయి.
కేవలం 3 ఓట్ల తేడాతో పీటీ ఉష టాప్-4 స్థానాన్ని కోల్పోయారు. గెలిచిన నలుగురు ఎస్ఓఎమ్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
బాస్కెట్బాల్ ప్లేయర్ అనితా పాల్కు కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐఓఏ నిబంధనల ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఎస్ఓఎమ్గా ఎన్నికవ్వాలి లేదా ఏదైనా స్పోర్ట్స్ అసోసియేషన్ నామినేట్ చేయాలి.
ప్రస్తుత పరిస్థితుల్లో పీటీ ఉషను ఏ క్రీడా సమాఖ్య నామినేట్ చేసే అవకాశం లేదు. పురుషుల విభాగంలో గగన్ నారంగ్, విజేందర్ సింగ్, యోగేశ్వర్ దత్, కమ్లేశ్ మెహతా ఏకగ్రీవంగా ఎస్ఓఎమ్లుగా ఎన్నికయ్యారు.
ఐఓఏ కొత్త కార్యవర్గం కోసం డిసెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలో గగన్ నారంగ్ ప్రధాన పోటీదారుడిగా నిలవనున్నారు. 2022 డిసెంబర్లో ఐఓఏ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పీటీ ఉష, ఐఓఏ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలిచారు.
అయితే ఆమె పదవీకాలంలో కార్యనిర్వాహక మండలి సభ్యులతో అనేక విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఓటమి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎస్ఓఎమ్ ఎన్నికలపై వివాదాలు కూడా తలెత్తాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని, ఓటర్లను ప్రభావితం చేశారని, బయటి వ్యక్తులు జోక్యం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
వాట్సాప్ సందేశాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని పీటీ ఉష ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిందని, దొంగ ఓట్లను నిరోధించేందుకు చర్యలు తీసుకున్నామని రిటర్నింగ్ ఆఫీసర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.




