ప్రజా సమస్యలు, NewzFast Telugu (పర్వతగిరి, వరంగల్ జిల్లా): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సూచించారు. పర్వతగిరి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
సమావేశంలో ప్రస్తావించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
గ్రామాల అభివృద్ధితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే నాగరాజు సూచించారు.
ఈ సమావేశంలో ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీఎం శేషాంజన్, డిప్యూటీ తహసీల్దార్లు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సావిత్రి, కల్లెడ పీఏసీఎస్ చైర్మన్ పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి పీఏసీఎస్ చైర్మన్ అత్తి కుమారస్వామి, పర్వతగిరి సర్పంచ్ శంకర్, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, గ్రామశాఖ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




