పీఎం సూర్యఘర్ రూఫ్‌టాప్ సోలార్ తెలంగాణ, NewzFast Telugu (హైదరాబాద్): పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం కింద రాష్ట్రంలో 40,349 ఇళ్లపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) సమ్మతి తెలిపింది.
ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.525 కోట్ల వ్యయం కానుంది. అందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.242 కోట్లను భరిస్తుంది, మిగిలిన రూ.283 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.
ఈ నిర్ణయం వల్ల గృహజ్యోతి సబ్సిడీ నుంచి ప్రభుత్వానికి ఉపశమనం లభిస్తుందని, 11 ఏళ్ల కాలంలో ఈ నిధులన్నీ తిరిగి వస్తాయని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా మొత్తం రూ.444 కోట్లు మిగులుతాయని తెలిపారు.
ఐదేళ్ల కాలానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) బాధ్యత యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలదేనని నియంత్రణ మండలి గుర్తు చేసింది. ఐదేళ్ల తర్వాత సోలార్ ప్లాంట్ల నిర్వహణ వినియోగదారులే చూసుకోవాలని తెలంగాణ రెడ్కోను ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను ఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, సభ్యులు కంచర్ల రఘు, చెరుకూరి శ్రీనివాసరావు సోమవారం జారీ చేశారు.

