ప్రధాని మోదీ రాహుల్ గాంధీ రాజ్యాంగం విమర్శ, NewzFast Telugu: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని తిరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండానే ఆయనపై సెటైర్లు వేశారు.
ఒక జాతీయ వార్తా సంస్థ గురువారం నిర్వహించిన ‘కిసాన్ తక్ భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్’లో మోదీ మాట్లాడారు. ఈ మధ్యకాలంలో కొందరు తమ జేబుల్లో నుంచి తరచూ రాజ్యాంగ ప్రతులను తీసి చూపిస్తున్నారని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం తమ జేబుల్లోనే ఉన్నాయని వారు భావిస్తున్నారని ఆయన అన్నారు.
అధికారంలో లేకపోయినా అదే అధికార మత్తులో ఉంటున్నారని విమర్శించారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఒక విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆర్థిక ప్రగతి పనితీరులో గుజరాత్ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని, ఈ విషయాన్ని ఒక మాజీ ప్రధానమంత్రి పేరుతో ఉన్న సంస్థే అధ్యయనం చేసి చెప్పిందని తెలిపారు.
అయితే ఆ సంస్థ రిపోర్టును ప్రచురించేందుకు నాటి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదని, రిపోర్టును మార్చాలని పరిశోధకులపై ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. ఈ అధికార అహం వారికి చాలాకాలంగా ఉందని ఆయన విమర్శించారు.
అదే కార్యక్రమంలో భూమాతను రక్షించుకోవాలంటే రైతులు ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.




