పవన్ కల్యాణ్ పెట్టుబడులు, NewzFast Telugu (విశాఖపట్నం): భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం వేగవంతమైన అభివృద్ధి కోసం కొత్త సంకల్పంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో మాట్లాడుతూ, జూన్ 2024 నుంచి రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన తెలిపారు. వీటి ద్వారా సుమారు 19.3 లక్షల ఉద్యోగాలు సృష్టించబడే అవకాశం ఉందని చెప్పారు.
పరిశ్రమలకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలకు ఈ ప్రభుత్వం ప్రధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర రేఖ ఎంతో లాభదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రకృతిపరంగానే ఆంధ్రప్రదేశ్ దేశ ఈస్టర్న్ గేట్వేగా ఉందని తెలిపారు.
అటవీ శాఖపై పెట్టుబడులు పెట్టాలని, పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ నమ్మకమైన ప్రాంతమని చెప్పిన ఆయన, సాంకేతికతను అందిపుచ్చుకుంటూ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని వ్యాఖ్యానించారు.




