పవన్ కళ్యాణ్ విడాకులు, NewzFast Telugu (ఆంధ్రప్రదేశ్): ఏపీలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజ్ నోవాకు తాజాగా విడాకులు ఇచ్చారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని, తమ నిర్ణయాన్ని, ప్రైవసీని గౌరవించాలని ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో అధికార కూటమిని నడుపుతున్న టీడీపీతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా వేర్వేరు ప్రకటనల్లో తమ కార్యకర్తలు, అభిమానులు ఈ వ్యవహారంపై స్పందించవద్దని కోరాయి. దీంతో దాదాపు అంతా మౌనంగా ఉన్నారు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని పలువురు పోస్టులు పెట్టారు. ఇందులో ఒక ఎన్టీఆర్ అభిమాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగి, డిప్యూటీ సీఎం విడాకుల వ్యవహారంపై అనుచిత పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో వారిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన ఎన్టీఆర్ అభిమాని విశ్వ తారక్, గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబు ఉన్నట్లు సమాచారం.
అదేవిధంగా సోషల్ మీడియాలో పవన్‌పై పోస్టులు పెట్టిన మరో 42 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పిఠాపురం జనసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం పవన్ మూడు పెళ్లిళ్లు, విడాకులు, భవిష్యత్తులో నాలుగో పెళ్లి చేసుకుంటారంటూ ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం. చట్టప్రకారం నోటీసులు జారీ చేసి, అరెస్ట్ చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ విడాకులపై ఇకపై పోస్టులు పెట్టేందుకు మిగతా వారు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.




