పాట్ కమిన్స్ శాండ్‌పేపర్ వివాదం, NewzFast Telugu (సిడ్నీ): ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన 2018 ‘శాండ్‌పేపర్ స్కాండల్’ ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఇటీవల విడుదల చేసిన తన ఆటోబయోగ్రఫీలో ఆనాటి సంఘటనపై సంచలన ఆరోపణలు చేయడంతో ఇది క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
కేప్‌టౌన్ టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్ గురించి జట్టులోని సభ్యులందరికీ ముందే తెలుసని, కమిన్స్‌తో సహా అందరూ బాధ్యత వహించాలని ఖవాజా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిడ్నీలో సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించి తీవ్రంగా స్పందించారు.
అవి 100 శాతం తప్పుడు ఆరోపణలని, ఆయన వ్యాఖ్యలు తమ రెప్యుటేషన్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని కమిన్స్ ప్రెస్మీట్లో తెలిపారు. ఖవాజా తన జీవితంతోనూ, ఆస్ట్రేలియా క్రికెట్ కీర్తితోనూ చెలగాటమాడుతున్నాడని ఆయన మండిపడ్డారు.
“ఖవాజా చెప్పినట్లుగా మైదానంలోకి శాండ్‌పేపర్ వెళ్లిందని మా అందరికీ తెలుసనడం వంద శాతం తప్పు. అది పూర్తిగా అర్ధంలేని అబద్ధం” అని కమిన్స్ స్పష్టం చేశారు.
అలాగే, తాను గానీ ఇతరులు గానీ ఆ కుట్రలో భాగస్వామ్యం కాలేదని ఆయన తేల్చిచెప్పారు. ఆనాటి ఘటనపై మాట్లాడుతూ, స్మిత్, వార్నర్‌లకు విధించిన శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయని కమిన్స్ అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో, అప్పట్లో ప్రత్యర్థులతో ప్రవర్తించిన తీరుపై తనకు కూడా కొన్ని అసంతృప్తికర విషయాలు ఉండేవని, కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో జట్టు ప్రవర్తనను పూర్తిగా మార్చానని ఆయన పేర్కొన్నారు.
ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓతో కూడా చర్చించినట్లు కమిన్స్ వెల్లడించారు. ఖవాజా తన కెరీర్ ముగిసిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేసినప్పటికీ, ఇకపై ఈ శాండ్‌పేపర్ వివాదం గురించి మాట్లాడబోనని కమిన్స్ తేల్చిచెప్పారు.
ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ బాల్ ట్యాంపరింగ్ ఘటనపై మాజీ సహచరుల మధ్య బహిరంగ వాదనలు తలెత్తడం ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది.




