పంజాగుట్ట AI పోలీస్ స్టేషన్, NewzFast Telugu (హైదరాబాద్): తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక రంగంలో కొత్త అడుగు వేయబోతోంది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు ఏర్పాట్లను పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏఐ సాంకేతికతతో అందుబాటులోకి రానున్న సేవలను పరిశీలించడంతో పాటు, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కొత్త విధానంలో పోలీస్ స్టేషన్‌లోని దాదాపు అన్ని సేవలకు ఏఐ సాంకేతికతను అనుసంధానించనున్నారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డైరీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్ తయారీ వరకు ఏఐ సేవలను వినియోగించనున్నారు.
దాదాపు 10 భాషల్లో ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేకంగా సేతు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిర్యాదులను ఏఐ ద్వారా స్థానిక భాషలోకి అనువదించి, క్షణాల్లో సంబంధిత అధికారులకు పంపించే సదుపాయం కల్పించనున్నారు.
ఈ కొత్త సాంకేతిక విధానాలపై పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పంజాగుట్టలో ప్రారంభించే పైలట్ ప్రాజెక్టు పనితీరు, ఫలితాలను అంచనా వేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇతర పోలీస్ స్టేషన్లలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రయోగం విజయవంతమైతే పోలీస్ సేవల్లో వేగం, పారదర్శకత, ప్రజలకు అందుబాటు మరింత పెరిగే అవకాశం ఉంది.




