సింధూ జలాలు, NewzFast Telugu (అంతర్జాతీయం): భారత్ – పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది.
ఈ ఆపరేషన్‌లో వందలాదిమంది ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ పేర్కొంది. అనంతరం పాకిస్థాన్‌పై భారత్ అనేక ఆంక్షలు విధించింది.
వాటిలో సింధూ జలాల పంపిణీ నిలిపివేత కూడా ఒకటి.
భారత్ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పలు అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ వైఖరిని ప్రస్తావించి, దౌత్యపరమైన ఇబ్బందులు సృష్టించాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
తాజాగా, వాతావరణ మార్పులపై జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP31) అంతర్జాతీయ సమ్మిట్‌లో షెహబాజ్ షరీఫ్ మరోసారి సింధూ జలాల నిలిపివేత అంశాన్ని ప్రస్తావించారు. నీటిని ఆయుధంగా వాడుకోవద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకూడదని ఆయన స్పష్టం చేశారు.
దేశాల మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందాలను గౌరవించాలని కూడా పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న పరోక్ష వ్యాఖ్యలుగా భావిస్తున్నారు. అదే సమయంలో, వాతావరణ మార్పుల కారణంగా సంక్షోభంలోకి వెళ్తున్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు సహాయం అందించాలని ఆయన కోరారు.
ఆ సహాయం అప్పుల రూపంలో కాకుండా గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
భారత్ – పాకిస్థాన్ మధ్య 1960లో ప్రపంచ బ్యాంకు సమక్షంలో సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలు భారత్‌కు, సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాకిస్థాన్‌కు కేటాయించబడ్డాయి.
గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా, పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై రెండు దేశాల మధ్య వైఖరులు ఇంకా భిన్నంగానే కొనసాగుతున్నాయి.




