ధాన్యం కొనుగోలు కేంద్రాలు, NewzFast Telugu (చిట్యాల, నల్గొండ జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. కొనుగోళ్లు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
గురువారం చిట్యాల మండలంలోని ఆరెగూడెం, వెలిమినేడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలు ప్రారంభించి 15 రోజులకు పైగా గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజులు, వారాల తరబడి పడిగాపులు కాస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో వివిధ కారణాలు చూపుతూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొందరు కాంగ్రెస్ నాయకులు రైతులను దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా జరిగేవని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేవారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్ ప్రారంభమై, తదుపరి పంట సాగుకు సమయం ఆసన్నమైనప్పటికీ ధాన్యం విక్రయించలేక రైతులు కేంద్రాల వద్దే ఉండిపోతున్నారని తెలిపారు.
పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక, తదుపరి పంటకు పెట్టుబడులు సమకూర్చుకోలేక అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.




