ఉస్మానియా నాన్ టీచింగ్ స్టాఫ్, NewzFast Telugu (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ స్టాఫ్ శ్రమను, రక్తాన్ని దోచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన సీఎం జాడ లేకుండా పోయారని ఆమె ధ్వజమెత్తారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉస్మానియా నాన్ టీచింగ్ స్టాఫ్ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద చేపట్టిన ఆందోళనకు కవిత మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 35 ఏళ్లుగా ఉస్మానియాలో నాన్ టీచింగ్ స్టాఫ్‌కు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉండటం క్షమించరాని నేరమన్నారు.
రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఉద్యోగులు, ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్నట్లుగానే ఉద్యోగి ఏడ్చిన యూనివర్సిటీ బాగుండదన్నారు.
నాన్ టీచింగ్ ఉద్యోగులంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా ఉండాల్సిన వీసీ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని మండిపడ్డారు.
టైమ్ స్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా వారిని కాదని కొత్త వాళ్లను నియమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏడాదిన్నరగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే ఎందుకు స్పందించటం లేదని ఆమె ప్రశ్నించారు.
వర్సిటీ చాన్సలర్‌గా ఉన్న గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని నాన్ టీచింగ్ స్టాఫ్‌కు మేలు జరిగేలా చూడాలని కోరారు.
ఉస్మానియాలో ఉద్యోగులకు ఓపీఎస్ స్కీమ్ వర్తింపజేస్తామని సీఎం పచ్చి అబద్ధాలు చెప్పారని కవిత అన్నారు. 2001 నుంచి 2004 వరకు ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేసే పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులైన శ్రీకాంత్‌గౌడ్, ఆకాశ్‌లకు అండగా నిలవాలని ఆమె కోరారు.




