ఓబ్యానాయక్ తాండ, NewzFast Telugu (ధన్వాడ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా): ఒకే తాండ రెండు మండలాల పరిధిలో ఉండటంతో తమ సమస్యలు పట్టించుకునేవారు లేరని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధన్వాడ మండల పరిధిలో ఓబ్యానాయక్ తాండ ఉండగా, రోడ్డు అవతల కోయిలకొండ మండల పరిధిలో బోట్యానాయక్ తాండ ఉంది.
పేర్లు వేరైనా రెండూ ఒకే తాండలోని ప్రాంతాలేనని స్థానికులు చెబుతున్నారు.
రోడ్డుకు ఒకవైపు ఉన్నవారు ఒక మండలానికి, మరోవైపు ఉన్నవారు మరో మండలానికి చెందినవారిగా పరిగణిస్తుండటంతో తాండలో ఏ సమస్య వచ్చినా ఏ మండల అధికారి స్పందించాలన్నది స్పష్టంగా లేదని గ్రామస్తులు తెలిపారు. బాధ్యత ఎవరిదో తేలక సమస్యలు ఏళ్ల తరబడి అలాగే ఉంటున్నాయని వాపోతున్నారు.
తాండలో రెండు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజల దాహం తీరడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయినప్పుడు తాండలోని ఆలయం వద్ద వేసిన బోరు బావే నిత్యావసరాలకు ఆధారమవుతోందని, గుక్కెడు నీటి కోసం కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం వస్తారని, ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గిరిజనులు మండిపడుతున్నారు. తాగునీటి సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని చెబుతున్నారు.
ఒక వార్డు సభ్యురాలు కూడా తమ సమస్యలు ఎవరూ గుర్తించడం లేదని, తాండను వేరువేరుగా చూడటం వల్ల ఇబ్బందులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి, రెండు మండలాల అధికారులతో కలిసి తాండను సందర్శించాలని గిరిజనులు కోరుతున్నారు. ముందుగా తాగునీటి సమస్యను పరిష్కరించి, మిషన్ భగీరథ సరఫరాను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండు మండలాల అధికారులు సమన్వయంతో తాండ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.




