ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం వద్దు, NewzFast Telugu (ఆదిలాబాద్ జిల్లా, రెబ్బెన): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం రెబ్బెన మండలంలో పర్యటించిన ఆమె మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, విద్యా ప్రమాణాలపై ఆరా తీశారు.
ఇంగ్లీష్, గణితం, సైన్స్ సబ్జెక్టుల బోధనపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని స్పష్టం చేశారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, రికార్డులు మరియు నగదు పుస్తకాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటి పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.
అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వ విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




