నిర్మల్ రైతు గర్జన కేటీఆర్, NewzFast Telugu (నిర్మల్): రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్ నిర్వహించిన రైతు గర్జన మహాసభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా రైతులు, యువకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో నిర్మల్ పట్టణం జనసంద్రంగా మారింది.
ఎన్టీఆర్ మినీ స్టేడియం సభా ప్రాంగణం కిక్కిరిసిపోగా, లోపల చోటు దొరకక వేలాది మంది ప్రజలు రోడ్లపై నిలబడి కేటీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై దాదాపు గంటపాటు ప్రసంగించారు.
ప్రసంగం ఆద్యంతం ప్రజల నుంచి చప్పట్లు, హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.
మూడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారని బీఆర్‌ఎస్ శ్రేణులు అభిప్రాయపడ్డాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు కేటీఆర్ రానున్నారని ప్రచారం జరగగా, మధ్యాహ్నం 2 గంటల నుంచే ప్రజలు సభాస్థలికి చేరుకున్నారు.
స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకొని కేటీఆర్ ఆయన ఎన్నికల హామీలను ప్రస్తావించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటిలో ఏ ఒక్కటైనా అమలైందా అని ప్రజలను ప్రశ్నించగా, సభకు హాజరైనవారు కాలేదని స్పందించారు.
రైతుబంధు పథకం రద్దుపై రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల వీడియోలను కూడా సభలో ప్రదర్శించారు.
ఈ సభకు సంబంధించిన ప్రసంగాల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. సభ నిర్వహణలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ విప్ బాల్క సుమన్, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తదితర నాయకులు కీలకంగా వ్యవహరించారు.
జనాదరణతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.




