నేతకాని కులస్తుల బతుకమ్మ, NewzFast Telugu (హనుమకొండ జిల్లా, సీతంపేట): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని నేతకాని కులస్తులు ప్రత్యేక బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న తమ ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, దీపావళి పండుగ సందర్భంగా బతుకమ్మను పేర్చి పూజలు నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రాంరెడ్డి హాజరయ్యారు. దీపావళి వేళ ప్రత్యేకంగా నిర్వహించిన ఈ బతుకమ్మ వేడుకలతో సీతంపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, తరతరాలుగా వస్తున్న మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రత్యేకంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దీపావళి పర్వదినాన బతుకమ్మను పేర్చి, సంప్రదాయ పాటలు, ఆటలతో వేడుకలు జరుపుకోవడం మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రతి కులం, ప్రతి సమాజానికి ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయని, వాటిని గౌరవిస్తూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు. మన పూర్వీకులు అందించిన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం ద్వారా మన మూలాలను, ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకోగలమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేణుకుంట్ల అశోక్, మండల మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి, 66వ డివిజన్ అధ్యక్షులు గొర్రె కిరణ్ తదితరులు పాల్గొన్నారు.




